నేను ఎప్పుడు ” అనుష్ఠానానికి ” కూచున్నా సరిగ్గా టాయిలెట్స్ కడిగే అమ్మాయి అప్పుడే వస్తుంది. మనిషి బక్కపలచగా నీరసంగా ఉంటుంది. జక్కంపూడి నుంచి రానూపోనూ 50/-ఇచ్చి ఆటో
కానీ ఆ అమ్మాయికి ఆకలి, అరడజను ఆడపిల్లల ఆలనా పాలనా తప్ప మన సెంటిమెంట్ పట్టదు అని గ్రహించా.
నాలాంటి వారు నలుగురు పని చెబితేనే ఆరోజు గడుస్తుంది ఆ ఇంటిల్లిపాదికి.
ఆటో చార్జీలు దాన్లో మళ్ళీ ఆసిడ్ బాటిల్, ఫినాయిల్ కి పెట్టుబడి పోగా మిగిలే ఏ యాభయ్యో, వందో రూపాయల కోసం మనం అసహ్యించుకునే పనిని ఆప్యాయంగా చేస్తుంది. అటువంటి అమ్మాయిని ఇవ్వాళ శుక్రవారం.. పైగా పూజ మధ్యలో ఉన్నా..రేపురా అని ఎలా అనగలను??
అలా అంటూ..” అన్తశ్చరతి భూతేషు *
- గుహాయామ్ విశ్వమూర్తిషు “అంటూ మననం చేస్తుంటే పూజిస్తున్న దేవుడు తెల్లబోడూ??
చదువుతున్నది ఏమిటి, చేస్తున్నది ఏమిటి?? అని అడిగితే మొహం ఎక్కడ పెట్టుకోను?? అందుకే పూజ ఆపి ఆ అమ్మాయి పని అయి పంపాకే శేషానుష్ఠానాన్ని సాగిస్తున్నా.
ఇక్కడే నాకు సందేహం ** వచ్చింది!!
అసలు ” అనుష్ఠానం “అంటే ఏమిటని!!??
అనుష్ఠానం ఒక పవిత్రమైన పదం.
పదం ఎంత గంభీరమో! దాని అర్ధం కూడా అంతే గూఢం.
భగవంతుడికి సంబంధించిన పదం కాబట్టి దీని అర్ధం విలక్షణంగానూ విస్తృతంగానూ ఉంటుంది.
” ఫలానాలా చేస్తేనే అనుష్ఠానం “ అని గిరి గీసి చెప్పటానికి లేకుండా ” గిరి ” అంత ఉన్నతమైన విలువ కలది. ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతునిలానే అనిర్వచనీయం.
సమాజహితం కోసం ఏకాగ్రత తో చేసే అనుష్ఠానం, ధ్యానం లేదా తపస్సు ఒక దృఢమైన సంకల్పశక్తి గా లోకకల్యాణానికి ఎలా మారుతుందో! మహానుభావుల చరిత్ర చూస్తే తెలుస్తుంది.
మరి మనం అలా చెయ్యాలంటే అంత మానసిక శారీరక తుష్టి పుష్టి మనకి ఉందా? అంత ఏకాగ్రత మనం సంపాదించుకోగలమా?? ఖచ్చితంగా నాలాంటి వాడు చెయ్యలేడనే చెప్పాలి. మరి సమాజానికి మన అనుష్ఠానం ఉపయోగపడటం ఎలా??
ఎలా అంటే, ” మన స్థాయిలో సమాజానికి ” ఉపయోగపడేలా మనం చేసే ప్రతీ చర్యా అనుష్ఠానమే. అలాంటి అనుష్ఠానాలు అవలోకించి చూస్తే అడుగడుగునా బోలెడు.
ఉదాహరణకు :
— జోరున వర్షం పడుతోంది.పక్కవాటా వాళ్ళు లేరు.కానీ వారు ఆరేసిన బట్టలు వానలో తడుస్తున్నాయి. వెంటనే మీరు అవి తీసి మడతబెట్టి రాగానే ఇస్తే వాళ్ళు ఎంత ఆనందిస్తారో కదా?
—- తెల్లవారుజామున మీరు జిమ్ కని బండి మీద వెళ్తున్నారు. ఇంతలో ఒక పెద్దమనిషి చేతిలో సూట్ కేస్ తో అటూ ఇటూ ఆదుర్దాగా చూస్తున్నాడు.
మీకు అర్ధం అయ్యింది ! ఆయన స్టేషన్ కి వెళ్లాలని. కనుచూపుమేరలో ఆటో కనపడటం లేదు. పోనీ మీ పని అంత అర్జంట్ కానప్పుడు ఆగి స్టేషన్ దగ్గర దింపితే ఆయన కి ఎంత ఊరట!! రైలు లో కూచొని ” దైవం మానుష రూపేణా “!! అన్నట్లు ” దేముడిలా అతనెవరో దించాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయ్యేది?” అన్న ఆయన కృతజ్ఞతా తలంపు మీకు ఎంత పెద్ద దీవెన!!
ఇలాంటివన్నీ అనుష్ఠానాలు కాదూ!!
— పండగ వచ్చింది. లాక్ డౌన్ మూలంగా పక్కవారు ఎక్కడో ఉండిపోయారు. పండగ రోజు కాస్త ముగ్గు, నాలుగు మామిడాకులు వాళ్ళ గుమ్మం ముందు ఉంచితే మన బతుకు పచ్చ తోరణం అవ్వదూ!!
— మన నోటికి భయపడి జోరు వర్షం లో కూడా మానకుండా వచ్చే పనిమనిషికి మనం తాగే కాఫీ లాంటిది ఇస్తే ఆ అమ్మాయి లో కలిగే
అల్ప కృతఙ్ఞత మనకి
అనల్పసంతోష హేతువవ్వదూ!!
— మన ఇంట్లో మనం తినటం కన్నా పక్క ఇంట్లో భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా వడ్డిస్తారో అలాగే మన ఒంట్లో భగవానుడు..పక్క ఒంట్లో వాడికి పెడితే అంతగానూ సంతోషపడతాడు కదా!!.
— భార్య శ్రద్ధగా వంట చేసి పెడుతుంటే మెచ్చుకోవడం,
పక్కవాడి తులసిమొక్కకి కాసిని నీళ్లు పోయడం,
వాళ్ళ కుక్కకి అన్నం పెట్టడం..ఇలా ఎన్ని రకాల అనుష్ఠానాలని!!
— చీరల షాపులో పనిచేసేవారికి సరైన పౌష్ఠీ కాహారం ఎక్కడ ఉంటుంది?? పైగా షాపులో ఉన్నంతసేపు అలా నుంచొని ఉండాల్సిందే.!!.డజన్లకొద్దీ చీరలు తీయిస్తూ,
ఆ సేల్స్ గర్ల్ సహనాన్ని పరీక్షిస్తూ, ఒక చీర కనీసం జాకెట్ కూడా తీసుకోకుండా వెళ్ళేవాళ్ళు ఎందరో??
ఆ అమ్మాయికి ” అమ్మే తెలివితేటలు లేవని ” ఓనర్ తిట్టే అరుపులు మన చెవికి వినపడవు. గతిలేని ఆ అమ్మాయి కన్నీరు మనకి కనపడదు…ఇది గ్రహించని మనం చేసే పూజకి పరమార్థం ఉందంటారా??
— ఎక్కే గుమ్మం దిగేగుమ్మం గా ఉద్యోగాలు చేసేవారు.. ఉంటారు. ఉదాహరణకు కేబుల్ టీవీ వాళ్ళుబిల్లు కోసం మూడంతస్తులు ఆయాసపడి ఎక్కివస్తే, మళ్ళీ రండి “అని విసుక్కోకుండా వెంటనే కట్టేస్తే ఆ చిరుద్యోగి ” అందరూ ఇలా ఉంటే ఎంత బాగుండు!!” అనుకోడూ!! అతనికి లభించిన ఆ చిన్న స్వాంతన భగవంతుడు మీ వైపు చూసేలా చెయ్యదూ?
—- ఒక చిన్న సైకిల్ మూలంగా మొత్తం ట్రాఫిక్ ఆగిపోతే ఎవరికి వారు నామోషీకి పోయి కార్లు, బళ్ల మీద బిర్రబిగుసుకుని కూచోకుండా ఆ సైకిల్ మీరు జరిపితే కొంతైనా సంస్కారం ఉన్న వ్యక్తులు మీ వైపు కృతజ్ఞతతో చూసే చూపు మీ వైటల్ ఎనర్జీ ని రెట్టింపు చెయ్యదూ??
— ఏదో వీక్ ఎండ్ లో మీరు ఏ పుణ్యక్షేత్ర మో వెళ్తున్నప్పుడు మీ కుటుంబసభ్యులు తో బాటు ఏ బీదవారినో ఒకర్ని తీసుకెళ్లి దర్శనం చేయిస్తే గుళ్లో దేముడు బోల్డు సంతోష పడిపోడూ??
—- మన ఇంట్లో పూచినవో, కాచినవో నలుగురికీ మనస్ఫూర్తిగా అందిస్తే, ఆ చెట్లు మరింత ఇవ్వడానికి సిద్దమవుతాయట. వాటి సగటు ఆయుర్దాయం కూడా పెరుగుతుందని చదివా. మనఇంటి పూలతో నలుగురూ చేసే పూజ, మన కాయలతో చేసే వైద్యమో, నైవేద్యమో!! ఎంత మంది చేస్తే అంత అనుష్ఠానం మనం చేస్తున్నట్లు కాదూ!!
— నేను చూస్తూ ఉంటా..చాలామంది ఇంట్లో చెత్త ని రోడ్డు మీద ఎవరూ చూడట్లేదన్న భ్రమలో ఇంకోరి ఇంటిముందు పారపోసేస్తూంటారు.
కొంతమంది చెత్త బుట్ట లో వేస్తారు కానీ దాన్లో కుమ్మరించడం వలన తీసుకెళ్లే పారిశుధ్య కార్మికులకు ఎంతో అవస్థ. కొన్ని చెత్తబుట్టలు చిల్లులు పడినా మార్చరు.. వాటినుంచి చెత్తరాలుతూ, కారుతూ ఉంటుంది..తినడానికి, సినిమాలకి పెడతాం కానీ చెత్త బుట్ట మంచిది కొననే కొనం.
పాపం ఆకార్మికుడు మనసు కష్టపెట్టుకున్నా మనకి చెప్పే ధైర్యం అతనికి ఉండదు. చెత్త నంతటినీ కారి బాగ్స్ లో పెట్టి వేస్తే తీసుకెళ్లే అతనికి ఎంత సౌకర్యంగా ఉంటుంది!! ఇలాంటి చిన్న సామాజిక బాధ్యత ని గుర్తించి మన వంతు కర్తవ్యాన్ని మనము నిర్వహిస్తే అంతకన్నా పెద్ద అనుష్ఠానం ఇంకేముంటుంది??
చివరిగా ఒక ఆహ్లాదమైన అనుష్ఠానాన్ని చెబుతా..
ఆ మధ్య “హంసల దీవి ” కి వెళ్ళా…నాకు తెలుసు అక్కడ బెస్తవారి పిల్లలు ఉంటారు. వాళ్ళకి చేపలు, సముద్రం తప్ప వేరే లోకం తెలియదు.
కార్లు, బైకులు వేసుకొచ్చి సముద్రంలో దిగి ఆటలాడుతూ తింటూ, తాగుతూ ఉండే మనుష్యులని ఆశ్చర్యంగా ఆశగా చూస్తూ దూరంగా ఉంటారు.
నేను వారికి సర్ ప్రైజ్ ఇద్దామని “కొన్ని వేఫర్లు..కొన్ని మిల్క్ డైరీ చాకలెట్స్ తీసుకెళ్లి పిలిచా” అవి చూపిస్తూ.
ముందు రామంటూ అడ్డంగా తల ఊపుతూ పారిపోయారు. తర్వాత దూరంగా నన్ను చూస్తూ నిలబడ్డారు. ఒకళ్లిద్దరు గుడిసె లో దూరి వాళ్ళమ్మకి చెప్పినట్లున్నారు. ఆవిడ తల బైట పెట్టి నన్ను చూసి ఏమనుకుందో ఏమో!! వాళ్ళకి ఏదో చెప్పింది.
అప్పుడు వాళ్ళు భయం భయం గానే దగ్గరకి వచ్చారు. అప్పుడు నేను చాకలెట్స్ ఇస్తూ వాళ్ళ వివరాలు కనుక్కుంటూ కబుర్లు చెప్పా.
ఆ వేఫర్స్, చాకలెట్స్..వాళ్ళు ఎప్పుడూ తినలేదట!.ఎవరూ ఇవ్వలేదట!! అసలు వాళ్ళని చేరదీసి ఇలా పలకరించింది లేదనే !చెప్పారు.
మాటల్లో సముద్రం గురించి ఎన్ని విషయా లు చెప్పారో?? ఆశ్చర్యం వేసింది.
“అలలు, వారి వలలు
చేపలు , తెరచాపలూ
బోటులు, కడలి అటు పోటులూ”..
ఇలా మా మధ్య స్నేహం కుదిరిన ఆ గంట అలా అలలా జారిపోయింది..నా హృదయం అల జారిన మెత్తని ఇసుకగా మారిపోయింది.
కొందరు ఆ చాక్ లెట్స్ కాగితాలు దాచుకున్నారు జేబుల్లో.
ఆడపిల్లలయితే నెమ్మదిగా తింటూనే ఉన్నారు.
చెలియల కట్ట దాటిన ఆ చిన్నారుల స్వచ్ఛ దరహాస తరంగాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పరుగున వెళ్లి వాళ్ళు దాచుకున్న గవ్వలూ, ఆల్చిప్పలు,నత్తగుల్లలు..ఇత్యాదివి పోటీపడి చూపించారు. ” అచ్చంగా నన్ను తీసుకోమని ” ఒకరిద్దరు కోరారు కూడా. నాకు ఏదో ఒకటి ఇవ్వాలన్న ఆ ” శైశవతపన ” చూస్తే ఎంత ముచ్చటేసిందో!!
నేనిచ్చిన చిన్న కానుక్కే వాళ్ళ మొహాలు లైట్ హౌస్ లా మారి వింతకాంతిపుంజం విరబూసి జీవితం పట్ల నా కున్న దృక్కోణానికి దిశానిర్దేశం చేసాయా ?? అనిపించింది.
చాలు ఈ జీవితానికి!! ఆ పసిమనసుల సమక్షంలో నేను చేసుకున్న ఈ ” చిన్ని అనుష్ఠానం ” . *
ఇలా చేసే అనుష్ఠానాలు కాకుండా, కొన్ని చేయకుండా ఉంటే అనుష్ఠానాలుగా మారేవి ఉన్నాయి :
ఉదాహరణకు
తన దారిన తాను పోతున్న కుక్కనో, పందినో ఊరికే కొట్టడం, నడుస్తున్న వారి మీద రోడ్డుపై నిలిచిన వాననీళ్లు పడేలా బళ్లు వేగంగా నడపడం,
అందుతున్నాయికదా!! అని అనుమతి లేకుండా పక్కవారి పూలు కాయలు కోసేయడం ఇలాంటివి చేయకుండా ఉంటే అనుష్ఠానం చేసినట్లే!!
ఇలా రాస్తూ పోతే ఎన్ని రకాల అనుష్ఠానాలైనా చెప్పచ్చు , చేస్తూ పోవచ్చు..
తోటివారి ని సంతోష పెట్టేదో, సాటివారి కన్నీరు తుడిచేదో!! ఏదైనా ” అనుష్ఠానమే “
మీరూ ఆలోచించండి.. ఆరంభించండి.
*శరీరానికి ఎంత కాంతి !
*మనసుకు ఎంత శాంతి !!