దుప్పటి

నాకు నచ్చిన కాశీభొట్ల కామేశ్వర రావు గారి “దుప్పటి” కథ. పాతదే ఐనా మళ్ళీ మళ్ళీ చదివించే కథ.
దుప్పటి
కాశీభొట్ల కామేశ్వర రావు

ఈ చిన్న కథలో అరవై ఏళ్ల క్రిందటి కోనసీమ వాతావరణం, అక్కడి మనుషుల మధ్య సంబంధాలు, ఆకుపచ్చటి కొబ్బరి తోటలు, గలగల పారే కాలవలూ , పిల్లలు చదువుకునే బళ్లూ, వాళ్ళు తినే చిరుతిళ్ళు, గోదావరిపై ప్రయాణాలు….. అన్నీ ఎంచక్కా స్మృతిపథంలో తిరుగాడుతాయి. ఓసారి అందమైన బాల్యంలోకి మనసు మళ్ళిపోతుంది.
* * *
దుప్పటి
కాశీభొట్ల కామేశ్వర రావు

(శ్రీ కామేశ్వర రావుగారి స్వగ్రామం అమలాపురం తాలూకా ఇందుపల్లి. కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేసి, అమలాపురం పురపాలక సంఘ పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసేరు.
వీరు సాహిత్యం పట్ల చిన్ననాటి నుంచీ మంచి అభిరుచి కలిగినవారు. ఈయన అడపాదడపా ఓ డజను కథలుదాకా రాశారు కానీ, ఈ దుప్పటి మాత్రమే లభ్యమౌతోంది.)

ఆ రోజుల్లో అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళడానికి రెండు మార్గాలు అందుబాటులో ఉండేవి. అమలాపురంలో బస్సెక్కి, బొబ్బర్లంక రేవు దాటి ఆలమూరు మీదుగా వెళ్ళడం ఒకటి;
లేదా ముక్తేశ్వరం వచ్చి, రేవు దాటి కోటిపల్లి మీదుగా రాజమండ్రి చేరడం మరొకటి. (అప్పటికి రావులపాలెం వంతెన పడలేదు. అందువల్ల ఇవే మార్గాలు).
సాధారణంగా రాముడు ఎప్పుడు అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళినా ఆలమూరు మీదుగానే వెళ్ళేవాడు. అయితే ఈసారి ఆ బస్సు దాటిపోయింది. అంచేత తప్పనిసరిగా కోటిపల్లి మీదుగా పోవలసి వచ్చింది.
ముక్తేశ్వరం రేవులో బస్ దిగి, రేవు దాటడానికి లాంచీ టికెట్టు తీసుకుంటున్నాడు.

ఇంతలో “ఒరేయ్.. రావుడూ! ఒరేయ్ రావుడూ !” అంటూ పరిచిత కంఠం వినిపించింది.
అతను వెనక్కి తిరిగి చూశాడు. కుంటి సోమన్న! అవును కనిపించేది కుంటి సోమన్నే.
కుంటి సోమన్నది రావుడూ వాళ్ల ఊరే. రావుడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు , వాళ్ల స్కూలు పక్కనే కుంటి సోమన్న పెసరట్ల కొట్టు ఉండేది. ఉదయం పూట పెసరట్లు, మధ్యాహ్నం కొబ్బరి లౌజు వెచ్చ వెచ్చగా బడి పిల్లలకి దొరికేవి. ఏదయినా, ఒక కానీ ఖరీదు!
ఈ పిల్లలకి తోటల్లో దొరికే కొబ్బరిపళ్ళు (రాలిన ముదురు కొబ్బరికాయలు) పట్టుకెళ్ళి కుంటి సోమన్నకే అమ్మేవారు. అప్పుడు కొబ్బరిపండు ఖరీదు కూడా ఒక కానీయే. వీళ్ళు ఇలా కొబ్బరి పండిచ్చి అలా కొబ్బరి లౌజు తీసుకునే వారు.

సోమన్నకి ఆ కుంటితనం ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఆ కారణంగా అతనికి పెళ్లి కాలేదు.
ఓ అంగవస్త్రం కట్టుకుని పెనం దగ్గర కూర్చునేవాడు. ఈ వ్యాపారంలో లాభం తియ్యాలనే ఆశ
కుంటి సోమన్నకి లేదు.
ఆ వీధిలోనే అతని అన్నదమ్ములున్నారు. రోజుకో ఇంట్లో భోజనం చేసేవాడు. కాకపోతే అతనికి నల్లమందు అలవాటొకటి ఉండడంవల్ల …..దానికి రోజూ ఓ అణా కావలసి వచ్చేది. ఈ దుకాణం వల్ల కుంటి సోమన్న ఆశించేది రోజూ ఒక్క అణా మాత్రమే.
అప్పుడప్పుడు పిల్లల దగ్గర డబ్బులు లేనప్పుడు , వాళ్ళకి తినాలని ఉన్నప్పుడు సోమన్న చూడకుండా సరుకులు ఎత్తుకుపోవాలని ప్రయత్నించే వాళ్ళు. కొందరి కుర్రాళ్ల ప్రయత్నం సఫలమయ్యేది కూడా. అయితే అది సోమన్న దృష్టిలో పడనే పడేది.
“వెర్రి వెధవల్లారా! కావాలని ఏడవకూడదూ? నేనే ఇద్దును కదా!” అంటూ మిగిలినవి తక్కిన కుర్రాళ్ళకి పంచిపెట్టేవాడు.

సోమన్న కొట్టు దగ్గరే కాలవ. ఈ కుర్రాళ్ళు ఆ కాలవలో ఈదేందుకు సోమన్న సాయం చేసేవాడు. కుంటివాడనే మాటే కానీ కాలువ ఈ మూలనుంచి ఆ మూలకి నాలుగు బారల్లో ఈదేసేవాడు. పిల్లలందరికీ చిన్న చిన్న గోచీలు పెట్టి ఈత కొట్టడం నేర్పేవాడు.
సోమన్న కొట్టు ఎదురుకుండా ఉన్న చింతచెట్టు కింద ఓపాక వేసి, రాముణ్ణి ప్రతిష్ఠించి , పిల్లలు భజన చేసేవారు. ప్రసాదాలు చేసి, పంచిపెట్టే బాధ్యత సోమన్న తీసుకునే వాడు. ఆ విధంగా రావుడితోపాటు పిల్లలందరి బాల్యజీవితంలోనూ సోమన్న ఓ భాగం అయిపోయాడు.!

ఆ సోమన్న రావుడికిప్పుడు కోటిపల్లి రేవు దగ్గర కనిపించాడు.
“ఇలాగ ఎక్కడికి పోతున్నావ్?” అన్నాడు.
“రాజమండ్రి…., ఉద్యోగం చేస్తున్నానక్కడ” అన్నాడు రావుడు.
“అబ్బో! పెద్దవాడవయ్యావురోయ్,” అన్నాడు సోమన్న ఆనందంగా.
“నువ్విక్కడున్నావేమిటీ ?” అంటూ , ఎదురుగా ఉన్న పెనం , పెసరట్ల పొయ్యి చూసి ‘నేను ఎంత తెలివి తక్కువగా అడిగేను’ అని అనుకున్నాడు రావుడు.
రోజులు మారిపోయాయనీ, తన పొట్ట తానే పోషించుకోవలసి వస్తోందనీ, ఓ రోజున పెనం, అట్లకాడా పుచ్చుకుని వాళ్ల ఊరునుంచి ఇక్కడకి వచ్చేసేననీ , ఇప్పుడిక్కడే ఉంటున్నాననీ చెప్పేడు సోమన్న. “పెసరట్టు కాల్చనా? ఇంకా నీకు లాంచికి అరగంట టైముంది.” అంటూ పెనం మీద రెండు పెసరట్లకి పిండి పోశాడు సోమన్న.

ఒకసారి మంట ఎగదోసి, “ఒరేయ్! విశ్వనాథంగాడు ఎక్కడున్నాడురా ఇప్పుడు?” అన్నాడు. విశ్వనాథం రావుడి చిన్ననాటి స్నేహితులలో ఒకడు. మంచి చురుగ్గా ఉండేవాడు.
“వాడిప్పుడు హైదరాబాదులో రైల్వేలో పనిచేస్తున్నాడు” అన్నాడు రావుడు.
“ఎప్పుడూ ఎవ్వరూ కనబడరురా” అన్నాడు సోమన్న పెసరట్టు మీద నెయ్యి పోస్తూ.
“ఒక్క చంద్రమతి మాత్రం రెండు మూడు నెలలకోసారి కనపడుతుందిరా. దాని అత్తారు కోటిపల్లే. ఇద్దరు పిల్లలు…. పలకరించి వెళ్తూంటుంది.” అంటూ పెసరట్లు ఆకులో వేసి అందించాడు సోమన్న.

రావుడి మనస్సు తన చిన్ననాటి తరగతి గదిలో విహరిస్తోంది. ఇంతలో లాంచి హారను వినిపించింది. ఉలిక్కిపడ్డాడు రావుడు.
“ఫర్వాలేదులే….ఇంకా పావుగంట ఉంటుంది.” అన్నాడు సోమన్న. ఘుమఘుమలాడే పెసరట్లు రెండు తిని, ఓ అర్ధరూపాయి సోమన్న కివ్వబోయాడు రావుడు. సోమన్న తీసుకోలేదు.
“ఉంచు.” అన్నాడు రావుడు.
“వద్దు…. డబ్బెందుకురా నాకు?” అని క్షణం ఆగి, “ఒరేయ్ రావుడూ! చలికి మహా బాధపడుతున్నాను–ఈ గోదావరి వార. దుప్పటీ గుడ్డ ఏదైనా ఉంటే పడేద్దూ.” అన్నాడు సోమన్న. ఆ అడగడంలో యాచనా, దైన్యం ఏమీ లేదు. ఆప్తమిత్రుడు అడిగినట్టే అడిగాడు.
రావుడి చేతిసంచీలో ఓ దుప్పటి ఉంది కూడా. కానీ అది ఒక వారంరోజుల కిందటే కొన్నాడు. దాని ఖరీదు పది రూపాయలు! అది ఇచ్చేద్దామా అని ఒక్కసారి రావుడికి అనిపించినా, అతని నాలుక మాత్రం యాంత్రికంగా, “ఈసారి వచ్చినప్పుడు తెస్తాలే,” అంది.

రావుడు సంచీ పుచ్చుకువచ్చి లాంచీలో కూచున్నాడు. గోదావరి కెరటాల మీద లాంచీ ఉయ్యాలలూగుతూ పోతూ ఉంది. రావుడి మనసు కూడా వివిధ భావాలతో అలాగే ఊగిసలాడుతూ ఉంది. చిన్ననాటి స్నేహితులు ఒక్కొక్కరే జ్ఞాపకానికి రాసాగారు.
‘చంద్రమతి ఇక్కడే కోటిపల్లిలో ఉందిట. అప్పట్లో వాళ్ల తరగతిలో తనే పెద్దపిల్ల. ఆదిలక్ష్మి శుద్ధ మొద్దుపిల్ల. తన లెక్కలు చూసి చేసేసేది. మేష్టారితో చెప్తానంటే మొట్టికాయలు మొట్టేసేది. శ్యామలా, మంగాయీ అప్పచెల్లెళ్లు. ఇద్దరూ ఒకే క్లాసు. వాళ్ళింటిదగ్గర మెట్టతామర పువ్వులుండేవి. సుందరికి ఆ పువ్వులంటే ఎంతో ఇష్టం. తను కోసుకొచ్చి ఆమెకిస్తూండేవాడు. సుందరి ఇప్పుడెక్కడుందో? నలుగురు పిల్లల తల్లై ఉంటుంది.
వేసవి వెన్నెల రాత్రుల్లో తన స్నేహితులతో కలిసి, మావిడి చెట్టుకింద కూర్చుని దూరంనుంచి వినిపించే గ్రామదేవత జాతర డప్పులు వింటూ ఎన్నెన్నో కథలు చెప్పుకునే వాళ్ళం! గుయ్యంగాడూ, ఆంజనేయుడి వేషం వేసే ఆ సత్యంగాడూ– వీళ్ళందరూ ఇప్పుడెక్కడికి పోయారో? ఇంక మళ్ళీ జీవితంలో అలా ఆడుకోగలనా?’ కరిగిపోయిన కాలాన్ని గురించి ఆలోచిస్తోంది రావుడి మనస్సు.

ఆ మధుర స్మృతులన్నీ అతనిలో తట్టిలేపి, తీయని రోజుల్ని జ్ఞాపకానికి తెచ్చిన వాడు సోమన్న! దానికి కృతజ్ఞతగా సోమన్నకి తనేమిచ్చాడు? ఒక్క దుప్పటీగుడ్డ అడిగాడు. అది కూడా ఇవ్వలేని క్షుద్రుడ్నయ్యాను.
అలా ఆలోచిస్తూ ఒక్కసారి ఒడ్డువైపు చూశాడు రావుడు. సోమన్న ఉండే పాక చిన్నగా కనిపిస్తూనే ఉంది. ఇక్కడ అందరూ సోమన్నని ఎరుగుదురు. లాంచీ దిగి, ఏ పడవ వాడికైనా దుప్పటీ ఇచ్చి పంపిద్దామనుకున్నాడు. కానీ ఆ కొత్త దుప్పటీ సోమన్నకివ్వక వాడే ఉంచేసుకుంటే??
ఇలా ఆలోచిస్తూన్న రావుడికి ‘సోమన్న సొమ్ము ఎవడూ అపహరించడులే’ అని మాత్రం అనిపించలేదు.

పడవ దిగి, బస్సెక్కేడు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న సువిశాలమైన సస్యశ్యామల ప్రదేశాలు కన్నులపండుగగా ఉన్నాయి. వాళ్ళ బడికి అవతలిపక్క అలాంటి చేలే ఉండేవి.
పెసర పైరు వేసినప్పుడు పిల్లలందరూ చేలోకి వెళ్ళి పెసర రొట్ట పీకి కాల్చుకుని తినేవాళ్ళు.
రావుడు ఊహాల్లో వుండగానే బస్సు రాజమండ్రి చేరింది. రాజమండ్రిలో దిగి, తనపనిలో తాను కూరుకుపోయినా, ఆ భావోన్మత్తత, అందుకు కారణమైన సోమన్నా రావుడి మనస్సును విడిచిపెట్టలేదు. మరునాటి మధ్యాహ్నానికిగానీ ఆ స్మృతులను మరచిపోలేకపోయాడు.

ఓ నెల గడిచింది. ఏదో పనిమీద రావుడికి అమలాపురం వెళ్ళవలసి వచ్చింది. ఈ సారి కోటిపల్లి మీదుగానే వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.
తన చిన్ననాటి స్నేహితుడి కోరిక నెరవేర్చడానికి దుప్పటీ కొనాలని అనుకున్నాడు. దుకాణానికి వెళ్ళేడు. రావుడి దగ్గర పుష్కలంగా డబ్బుంది. కానీ ఆ కుంటివాడికి పెద్ద ఖరీదైన దుప్పటి ఎందుకనే పిసినారి భావం ఏదో అతనిలో వచ్చేసింది. ఆరు రూపాయలిచ్చి ఓ దుప్పటీ కొన్నాడు.

ఉదయాన్నే బస్సెక్కి బయలుదేరేడు రావుడు. కోటిపల్లి చేరేసరికి తొమ్మిదైంది. లాంచీ గోదావరిలో సగం దూరం వచ్చేసరికి సోమన్న పాక కనపడుతోంది.
తనని చూసి సోమన్న పిలుస్తాడు. పిలవకపోయినా తనే పాకలోకి పోయి, రెండు నేతి పెసరట్లు కాల్పించుకుని తిని సోమన్నకి దుప్పటీ ఇవ్వాలి. రావుడు ఆలోచనలలో ఉండగా లాంచీ ఒడ్డుకు చేరింది.

అతను దిగి, సంచీ పుచ్చుకుని ముందుకు నడుస్తున్నాడు. సోమన్న పాక దగ్గర ముగ్గురు నిలబడి ఉన్నారు. అందులో సోమన్నకి అన్నగారైన వెంకటప్పయ్య ఒకడు.
“ఏమోయ్ , ఇల్లావచ్చావ్?” అన్నాడు రావుడు వెంకటప్పయ్యతో. కానీ వెంకటప్పయ్య ఏమీ బదులు చెప్పకుండా పాకలోకి వెళ్ళేడు. రావుడు కూడా వెనకాలే లోపలికి వెళ్ళబోయాడు. ఇంతలో ఒకడు అతని జబ్బ పట్టుకుని ఆపేడు. రావుడు పక్కకి తిరిగి, “సోమన్న?” అన్నాడు.
“సోవన్నగారు సచ్చిపోయారు. రేత్రి నాలుగు డోకులెళ్ళాయి,” అన్నాడు.
రావుడికి అంతా అర్థమైంది. అలాగే నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. వెంకటప్పయ్య సోమన్న శవాన్ని ఇవతలికి తెచ్చాడు. చాలా నీరసించి, పీక్కుపోయి ఉంది ఆకృతి. శవాన్ని గంపలో కూచోబెట్టి, “ఏదైనా గుడ్డ కప్పాలి,” అన్నాడు వెంకటప్పయ్య.

రావుడు తలవంచుకుని, తన సంచీలోంచి కొత్త దుప్పటి తీసి సోమన్నకి కప్పేడు. * * *

చక్కటి అనుభూతులను పంచుతూనే రచయిత ఈ కథలో మనిషిలో పిసినారితనం ఎంత లోతుగా ఉంటుంది..? దాని ప్రభావం ఎటువంటి పరిణామాలు కలుగచేస్తుంది అనే విషయాన్ని ఎంతో సహజంగా చిత్రీకరించారు. లోభం మనిషిలో ఒక సాధారణ బలహీనత అని రావుడి ద్వారా చెప్పేరు.

సోమన్న నిస్వార్థంగా, వయోభేదం లేకుండా పిల్లలతో మైత్రి నెరపినవాడు. ఈవాల్టికికూడా డబ్బులు తీసుకోకుండా పెసరట్టు నేతితో కాల్చి తినిపించినవాడు. రావుడిలో నిద్రాణమై ఉన్న గతకాలపు మధురానుభూతులను తట్టి లేపినవాడు.
కానీ, రావుడు?? ఒక్క దుప్పటీ గుడ్డ అడిగితే ఏదో కారణం చెప్పుకుని తప్పుకున్నాడు. ఇవ్వాలని లేక కాదు… అంత ఖరీదుది ఎందుకనే లోభగుణం. చివరికి తను కొనదలుచుకున్న ఖరీదులోనే కొన్నాడు….కానీ అది సోమన్న శవం మీద కప్పడానికే ఉపయోగపడింది కానీ బతికుండగా అతన్ని చలినుంచి కాపాడలేక పోయింది.

చెయ్యదలుచుకున్న పని….ముఖ్యంగా దాన ధర్మాల వంటివి వెంటనే తక్షణమే చేసేయాలి. లేకపోతే ఈ దిక్కుమాలిన మనసు మాయ చేస్తుంది. వేరే ఆలోచనలు వస్తాయి. వాటిని సమర్థించుకునే తర్కం పుట్టుకొస్తుంది. నువ్వు ఇవ్వదలుచుకున్నది వాయిదా వేస్తే, రేపు పుచ్చుకునేందుకు వాడు ఉండకపోవచ్చు….ఇచ్చేందుకు నువ్వూ లేకపోవచ్చు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s