ఎవరైనా మీ మనసు మీద దెబ్బ కొట్టే మాటలు మాట్లాడితే మౌనంగా భరించండి కానీ మాటలు జారితే బంధాలు విచ్చిన్నం అవుతాయి…మాటకు అంత బలముంది! నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు…అదే మాట తీరు…ప్రతి రోజు ఎంతో మందితో మాట్లాడితే చాలా మందిలో పరిపక్వత తో కూడిన మాటలు కనబడవు! ఒకాయన తన ఆత్మస్తుతి వినిపిస్తే మరొకాయన తన ప్రొఫెషన్ డబ్బా కొట్టుకుంటాడు! చాలా మందిలో సెల్ఫ్ గోల ఎక్కువే! అయితే ప్రతి మాటను మనం పరిశీలిస్తే ఆయన మానసిక స్థితిని అంచనా వేయవచ్చు! కాకి – కోయిల నలుపే కానీ కాకి గోల అంటారు… కోకిల రాగం అంటారు మాట తీరు కూడా అంతే ఆచితూచి మాట్లాడే వారికి గౌరవం ఎక్కువ! సుత్తి కొట్టే వారిని వదిలించుకుందామని అనిపిస్తుంది! చాలా మంది తన గొప్ప తనం తనకు తాను చెప్పుకునే వారికన్నా ఆయన గురించి మరొకరు మంచిగా చెప్పిన వారికే గౌరవం ఉంటుంది! విచిత్రం ఏమిటంటే మానసిక శాస్త్రం అవపోసనం పట్టే వారికి ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటల్లో అబద్దాలు ఎన్నో ఇట్టే అర్థం అవుతాయి! కడుపులో నుండి మాట్లాడే వారే నిజాయితీగా ఉంటారు! ఆర్భాటాలు చెప్పే వారు ఎదుటివ్యక్తిలో లోకువ ఆవుతారు!ఇక కొంత మంది ఉంటారు
చిన్న మాటకే చివ్వుకున్న చిన్నబుచ్చుకుంటారు… ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మాట్లాడలేదో గ్రహించకుండా నోరు పారేసుకుంటారు.. అది జీవిత కాలం మనసులో నిక్షిప్తం అయ్యి ఆ మనిషిని చూస్తే ఆ మాటలే గుర్తుకు వస్తాయి! ఎదుటి వ్యక్తిని కించపరిచే మాటలు మాట్లాడితే ఆయనతో పనిబడ్డప్పుడు మీ ముఖం లో అంతరాత్మ ప్రవేశించి ఆ మాటలను గుర్తుకు తెస్తాయి! తండ్రి కొడుకుల బంధాలు,అత్తా కోడలు బంధాలు ఈ మాట తీరుతో విచ్చిన్నం ఆవుతాయి! మనవణ్ణి ఎత్తుకొని ముద్దాడుతున్న కూడా …కోడలు దెప్పి పొడిచే మాటలకు వాడిపై ఆపేక్షను పక్కన బెట్టి “నువ్వు కూడా మీ అమ్మ తీరే పోరా” అంటూ కోడలి మాటలను గుర్తుకు తెచ్చుకొని ఏడ్చే అత్తగార్లు ఉన్నట్టే నువ్వు మీ అమ్మ పోలికే అన్నన్ని మాటలు అని ఇప్పుడు కాళ్ళ బేరానికి వస్తారా అనే మొగుణ్ణి చీదరించుకునే కోడలు దెప్పి పొడుపులు చాలా కుటుంబాల్లో కనబడతాయి!మనిషి మాట్లాడే మాటల్లో
తిట్లూ, దీవెనలు, పొగడ్తలు, విమర్శలు కపట వాక్యాలు.. ఇలా ఎన్నెన్నో వినిపిస్తుంటాయి. అందులో సార్థకమైనవి కొన్నైతే నిరర్థకమైనవి ఎన్నో ఉంటాయి.మనిషి వ్యక్తిత్వం అతడి మాటల్లో తొంగి చూస్తుందంటారు పెద్దలు. అందుకే మంచి మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి. మనిషికి ఆరు రకాల బాషణాలు వన్నె తెస్తాయి..మిత భాషణం హిత భాషణం, స్మిత భాషణం, ప్రియ భాషణం, పూర్వ భాషణం, సత్య భాషణం!! అలా మాట్లాడటం నిజంగా ఒక కళ ! చాలా కొద్దిమంది ఆకర్షణీయంగా మాట్లాడగలుగుతారు. ఎదుటి మనిషి నొచ్చుకోకుండా దేన్నయినా చక్కగా చెప్పగలుతారు. మనలో ఎన్నో ఉద్వేగాలలోంచి ఒక మాట బయటికి వస్తుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితిలోనూ చక్కగా మాట్లాడగలగటం ఒక నేర్పు. అందమైన భావవ్యక్తీకరణకు తగినంత అందమైన భాష తో మాట్లాడితే గౌరవం పెరుగుతుంది. మాట ఒక మలయ సమీరంలాగా ఉండాలి. ఒక సువాసనల మెత్తని పువ్వు లాగా అవతలి మనిషికి చేరాలి. మెత్తని ఈకతో గాయం పైన నవనీతం రాసినంత సున్నితంగా ఉండాలట! అంతేగానీ అది పుల్ల విరిచినట్లు.. అవతలి మనిషి మొహం తిరిగిపోయేంత నొప్పి తగిలినట్లు ఉండకూడదు. మాట తేనె కంటే మధురంగా ఉండాలి!!